పరిశుద్ధ మరియరాణి మహోత్సవం (ఆగష్టు 22)

 

క్రీస్తు ప్రభువుని తల్లి  మరియమాతను కతోలిక విశ్వాసులు ప్రాచీన కాలం నుండే రాజ్ఞిగా గౌరవించటం ఆనాదిగా వస్తున్న విశ్వాసం.

పరిశుద్ధ మరియమాత ఈ లోకంలో ప్రభువుని మార్గంలో పయనించారు.  విశ్వాసముతో ఈ లోక యాత్రను  ముగించుకొని "మోక్షారోపణం" చెందిన మరియతల్లిని, తండ్రి కుమారా, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు దైవ వ్యక్తులు ఆమెను ఇహఃపరలోకాలకు రాజ్ఞిగా నియమించి కిరీటం ఉంచారు. శ్రీసభ ఆమెను రాజ్ఞిగా ఎన్నుకొని "మరియ రాజ్ఞి" మహోత్సవాన్ని నెలకొల్పింది.

ప్రతిఏటా ఆగష్టు 22వ తేదీన మన తల్లి శ్రీసభ "మరియ రాజ్ఞి" ఉత్సవాన్ని భక్తివిశ్వాసాలతో కొనియాడుతూ, మరియమాత ఇహ:పరలోకాలకు రాజ్ఞి అనే సత్యాన్ని ప్రకటిస్తుంది.

12వ భక్తినాథ పోపుగారు విశ్వాసుల కోరిక నిమిత్తం 1954 అక్టోబర్ 11న, "మరియరాణి" పండుగను దైవార్చన  కాలెండరులో చేర్చారు. మరియు  మరియ మాతకు "రాణి" అనే బిరుదు ఆమోదయోగ్య మైనదని పేర్కొన్నారు. ఇప్పుడు "మరియరాణి" పండుగను మరియ "మోక్షారోపణ" పండుగనుండి ఎనిమిదవ నాడు (ఆగస్టు 22) కొనియాడినట్లు శ్రీసభ నిర్ణయించింది.

యెషయా ప్రవక్త  చెప్పినట్లుగా "యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కని, అతనికి ‘ఇమ్మానుయేలు’ అని పేరు పెట్టును" (యెషయ. 7:14). అని  ప్రవచించిన ఈ ప్రవచనం దావీదు వంశములో జన్మించబోవు "రాజు"కు తల్లి కాబోతున్న "రాజమాత" మరియను గూర్చి తెలియపరుస్తున్నది.  దావీదు వంశములో జన్మించిన రారాజు మెస్సయ్యకు తల్లి మరియమాత కావున తన కుమారుని రాజ్యములో "రాజమాతగా" "పరలోక రాజ్ఞిగా" వెలుగొందుతున్నారు. మరియ తల్లి ప్రార్థన సహాయంతో మనమందరము మన ప్రభువైన యేసు క్రిస్తుమార్గం లో నడుస్తూ మరియా తల్లి వలె పరిశుద్ధంగా జీవించుదాం.  

పరిశుద్ధ మరియరాణి మహోత్సవ సందర్భముగా ప్రజలందరికి పండుగ శుభాకాంక్షలు.

 

 

Add new comment

11 + 7 =