కార్మెల్ మాత  మహోత్సవము

కార్మెల్ మాత  మహోత్సవము

ఒకానొక సమయంలో మరియ అను ఒక నిష్కళంక యువతి ఉండేది. ఆమె ఎల్లప్పుడూ స్వచంగా, పవిత్రంగా ఉండులాగున తండ్రి దేవుడు ఆమెను ఎల్లప్పుడూ దీవించారు. ఆమె ఎంత పవిత్రురాలంటే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపడానికి, ఆయనకు తల్లిగా ఉండడానికి మరియను ఎన్నుకున్నాడు. మరియ దేవుని చిత్తానికి తన సమ్మతాన్ని తెలిపిన కొన్ని నెలల తర్వాత దేవుని కుమారునికి జన్మనిచ్చింది. దానినే మనం క్రీస్తు జయంతి పండుగ లేదా క్రిస్మస్ పండుగ గా కొనియాడుతున్నాం. 

క్రీస్తు ప్రభువు సిలువ పై మరణించే సమయంలో మరియమాత ఆయనకే కాదు మనందరికీ కూడా తల్లి అని క్రీస్తు ప్రభువు చెప్పారు. దేవుని ఎంతగానో ప్రేమించిన మరియతల్లి వలెనే మనం కూడా తండ్రి దేవుని ప్రేమించేలా మరియతల్లి మనలను ప్రేరేపించాలని క్రీస్తు ప్రభువు కోరారు. 

క్రీస్తు మరణించిన కొన్ని వందల సంవత్సరముల తర్వాత ఇశ్రాయేలు దేశంలో క్రీస్తును అనుసరించే కొందరు యువకులు దైవసేవ చేస్తూ కార్మెల్ అనే పర్వత గుహలలో  జీవిస్తూ ప్రజల మధ్యకు వచ్చి క్రీస్తు సువార్తను బోధించేవారు. కానీ వారి వస్త్రధారణ వల్ల ప్రజలు వారిని ఎగతాళి చెయ్యడం ఆరంభించారు. కొందరినైతే ప్రజలు గాయపరిచారు కూడా. 

అయితే వారిని నడిపించు గురువైన సైమన్ గారు మరియతల్లి సహాయం కోసం ఎంతో ఆర్తితో ప్రార్ధించడం ప్రారంభించారు. ఆశ్చర్యంగా మరియతల్లి ఆయనకు దర్శనమిచ్చి ఆయన ప్రార్ధనలకు కృతఙ్ఞతలు చెప్పి, వారికి ప్రజలతో ఎటువంటి అపాయం లేకుండా తండ్రి వారికి సహాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఆమె సహాయం మరియు భూమి పై తన బిడ్డలందరి సహాయం వారికి తోడుగా ఉన్నాయని ధైర్యాన్ని చెప్పారు.

అప్పుడు మరియతల్లి సైమన్ గారికి ఒక ప్రత్యేక ఆయుధాన్ని ఇచ్చారు. అదే మరియతల్లి ఉత్తరీయం. దానిని ధరించిన ప్రతి ఒక్కరు క్రీస్తు వద్దకు నడిపించే మరియతల్లి యొక్క దయ, ఆదరణ మరియు ప్రేమను పొందుతారని ఆమె సైమన్ గారికి ధైర్యం చెప్పారు. వెంటనే సైమన్  గారు తన సహచరుల వద్దకు వెళ్లి ఉత్తరీయమును చూపించి, దాని విశిష్టతను వివరించారు. తర్వాతి కాలంలో ఈ గురువులు కార్మెల్ గురువులుగా పిలువబడుతూ, అందరు ఉత్తరీయాలను తయారు చేసుకొని ధరించడం, తద్వారా మరియతల్లి భద్రతను అనుభవించడం మొదలు పెట్టారు. 

కార్మెల్ కొండపై సైమన్ గారికి దర్శనమిచ్చిన మరియతల్లిని కార్మెల్ మాతగా పిలవడం ప్రారంభమైంది. ఈ కార్మెల్ గురువుల నిరాడంబర జీవితం ఎందరో యువకులను ఆకర్షించి వారు కూడా ప్రభుని సేవకు ముందుకు వచ్చి కార్మెల్ సభ లో గురువులుగా కన్యస్త్రీలుగా తమ జీవితాలను దైవ సేవకు అంకితం చేసేలా నడిపించింది.

నేటి రోజున ఉత్తరీయాలు కార్మెల్ సభ వారే కాక ఇతర సభల గురువులు కూడా ధరించడం, ప్రజలకు కూడా పంచిపెట్టడం దాని ద్వారా మరియతల్లి ఆశీర్వాదాలు ప్రజలకు పంచడం జరుగుతుంది.

ఆ కార్మెల్ మాత ప్రేమ, దయ, సంరక్షణ మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ప్రార్ధిద్దాం.

 

Article by

Arvind Bandi

Online Producer

Add new comment

6 + 12 =