ఏసు దివ్యరూపధారణ పండుగ TRASFIGURATION OF OUR LORD

(తాబోరు పర్వతం పై ఏసు పేతురు, యాకోబు, యోహానులకు తన దివ్యరూపం ప్రదర్శించుట 1వ శతాబ్దం)

ఏసుప్రభువు సిలువ పాటులు భరించడానికి ఒక ఏడాది ముందుగా తన అనుంగు శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని కైసరియా ఫిలిప్పినుండి ఎనిమిది దినాలు ప్రయాణంచేసి అక్కడ ఉన్న ఒక ఉన్నత పర్వతం పైకి ఎక్కివెళ్లారు. 

ఆ పర్వతం ఏదని పరిశోధింపగా క్రీ||శ|| 254లో అది గలిలీ ప్రదేశంలో తిబేరియా సరస్సుకు దాదాపు రెండువేల అడుగుల ఎత్తున ఉన్న తాబోరు పర్వతంగా గుర్తింపబడింది.

“అచట వారి ఎదుట ఏసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లగానయ్యెను. ఆయనతో మోషే, ఏలీయాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి” (మత్త. 17:2-3) మోషే-ధర్మశాస్త్రానికి గుర్తుకాగా, ఏలీయా ప్రవక్తలకు ప్రతినిధి. వారు ఏసుప్రభువును ఆరాధించారు. సంభాషించారు. ఇదే సమయంలో పరలోక తండ్రి దివ్యవాణి మరొక్కసారి “ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయననుగూర్చి నేను ఆనందభరితుడనైతిని. ఈయనను ఆలకింపుడు” (మత్త. 17:5) అని చెప్పడం విన్పించింది.

మహోన్నతమైన గొప్పతనంతో ప్రభువు బహిరంగ జీవితం ఆరంభించడానికి, రాబోవు మహిమలో ఒక్కింత ఇప్పుడే రుచిచూసిన భాగ్యంపొంది ఏసుప్రభువు అనుభవింపబోతున్న వేదన, శ్రమలు చూసి, బెదరి చెదరిపోకుండ ప్రభుశిష్యులు తమ విశ్వాసంలో బలపడటానికి గాను ఈ ఏసు దివ్యరూపధారణ మహాత్మ్యంయొక్క దృశ్యం పేతురు, యాకోబు, యోహానుల్లో హృదయం నిండా బాగా వేళ్లూనింది.

పూర్వంలో విగ్రహారాధన, ఏదో భేతాళ కల్పిత కథల్లాంటి దబ్బరదేవుళ్ల పండగ స్థానంలో వాటిని పరిత్యజించి క్రైస్తవులైన ప్రజలు ఏసు దివ్యరూపధారణ మహోత్సవానికి తెరతీసినట్లు తెలుస్తుంది. ఇది నాలుగు లేక 5వ శతాబ్దారంభంనుండి ఈ పండుగ జరుపబడుతున్నట్లు బోధపడుతుంది. ప్రాచ్య శ్రీసభలో ముఖ్యంగా అర్మేనియాలో ఈ పండగ మూడు నుండి ఆరు రోజుల వరకు జరుపుకున్నారు. పశ్చిమ ప్రాంత శ్రీసభలోనేత్రి 9వ శతాబ్దంనుండి ఈ పండగ ఆచరిస్తున్నట్లుగా చరిత్ర వ్రాతలను బట్టి తెలుస్తున్నది.

15వ శతాబ్దంలో జరిగిన అద్భుత సంఘటన ఇది. అపరిమిత సంఖ్యలో ఉన్న టర్కీ సైనికదళం పై, అందులో కేవలం నాలుగోవంతు మాత్రమే ఉన్న క్రైస్తవ సైన్యం దేవుని దయవల్ల, బెల్గ్రేడ్ లో జరిగిన ముఖాముఖి యుద్ధంలో ఘనవిజయం సాధించిన సందర్భంను పురస్కరించుకొని ప్రతిఏడాది “ఏసు మహిమరూప ప్రదర్శన ఉత్సవం” జరుపుకునేలా అది యావత్ ప్రపంచంలో శ్రీసభ కొనియాడేలా విస్తరింప 3వ కలిస్తస్ జగద్గురువులు క్రీ.శ. 1456లో నిర్ణయం జారీ చేశారు. ఇదే పండుగ రోములోని పునీత యోహాను ల్యాటరన్ దేవాలయంలో సాధారణ క్రమంలోనే జరుపబడుతోంది.

Add new comment

5 + 11 =