Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. ఐతే, దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి ఏటా మార్చ్ 8 వ తారీఖున నిర్వహిస్తోంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.
ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్హెగెన్ నగరంలో 1910లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్' సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి.
1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది.
సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది.
వాస్తవంగా.. కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం ఈ దినోత్సవం వెనుక ఉన్న కారణం.
1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ''ఆహారం - శాంతి'' డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు
మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చ్ 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొంటున్నారు.
అంతర్జాతీయ మహిళల దినోత్సవం చాలా దేశాల్లో జాతీయ సెలవు దినం. మార్చి 8కి ముందు, తర్వాత మూడు నాలుగు రోజుల పాటు రష్యాలో పువ్వుల కొనుగోళ్లు రెండింతలు అవుతుంటాయి.
చైనాలో మార్చి 8వ తేదీన స్టేట్ కౌన్సిల్ సిఫార్సు మేరకు చాలా మంది మహిళలకు సగం రోజు పని నుంచి సెలవు లభిస్తుంది.
ఇటలీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మిమోసా అనే చెట్టుకు కాసే పువ్వులను బహూకరించి జరుపుకుంటారు.
అమెరికాలో మార్చి నెల మహిళల చరిత్ర నెల. అమెరికా మహిళల విజయాలను గౌరవిస్తూ ప్రతి ఏటా అధ్యక్ష ప్రకటన వెలువడుతుంది.
మనిషి పుట్టుకలో ప్రాణం మగువ
మనిషి ఎదుగుదలలో సహకారం మగువ
మనిషి అభ్యుదయంలో వెన్నెముక మగువ
మనిషి విజయానికి మూలాధారం మగువ
తల్లిలో లాలన మగువ
అక్కలో ఆదరణ మగువ
ఆలిలో సహకారణ మగువ
బిడ్డలో ఆప్యాయత మగువ
జీవితానికి ఆరంభం మగువ
జీవికి ఆధారం మగువ
జీవనానికి ఆలంబన మగువ
జీవిత సార్ధకతకు సోపానం మగువ
జీవితంలోని సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని ప్రగతికి బంగారు బాటలు వేస్తున్న మహిళామణులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Add new comment