హోరెత్తిన నల్లమల ఉద్యమం

దట్టమైన అభయారణ్యాలు. అరుదైన జంతు జాతులు. లెక్కలేనన్ని క్రూర మృగాలు, పులులు.. ఎటుచూసినా కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు. ఏపీ, తెలంగాణలోని కర్నూలు, మహబూబ్‌నగర్, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ పచ్చని అడవులే "నల్లమల అడవులు " .

నల్లమల అడవుల్లో యురేనియం ఉన్నట్లు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నిక్షేపాలను గుర్తించేందుకు సర్వేకు అనుమతి ఇచ్చింది. నల్లమల అడవిలోని కుంచోని మూల నుంచి పదర వరకు మొదటి బ్లాక్​లో 38 చదరపు కిలో మీటర్లు, పదర నుంచి ఉడిమిల్ల వరకు రెండో బ్లాకులో 38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలుగు వేల బోర్లు వేసి, నమూనాలు సేకరించేందుకు భారత అణుశక్తి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు అనుమతులు రావడంతో అచ్చంపేట, అమ్రాబాద్​ అటవీశాఖ అధికారులు, సిబ్బంది కలిసి వారం రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. డ్రిల్లింగ్​యంత్రాలు తీసుకు వచ్చేందుకు రూట్​మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.

2030 నాటికి అణు విద్యత్తు ఉత్పత్తి 40వేల మెగావాట్లకు చేరాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లు భారత అటామిక్ ఎనర్జీ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. యురేనియం నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలని స్పష్టం చేసింది. దీంతో హై గ్రేడ్, దీర్ఘకాలం పాటు దొరికే యురేనియం నిక్షేపాల కోసం వెతగ్గా.. నల్లమల అడవుల్లో దొరుకుతున్నట్లు తెలిసింది. వెంటనే ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీకి నివేదించగా.. ఆ కమిటీ ఆందోళన వ్యక్తం చేసినా, జాతి ప్రయోజనాల దృష్ట్యా యురేనియం తవ్వకాలు అత్యవసరం’ అని ప్రాజెక్టుకు అప్రూవల్ ఇచ్చారు.

యురేనియం సర్వే గురించి తెలియగానే మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విపక్ష నేతలు రంగంలోకి దిగారు. నల్లమలలో పర్యటించి, యురేనియం తవ్వకాల వల్ల కలిగే చెడు పరిణామాలపై స్థానికులకు వివరించి, వారిని చైతన్యవంతుల్ని చేశారు. యువజన, కుల సంఘాల నాయకులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. చెంచులు, స్థానికులు ఏకమై.. తమ ప్రాణాలను అడ్డు పెట్టయినా అడవిని, తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటామని శపథం చేస్తున్నారు. బృందాలుగా రోడ్లపైకి వచ్చి రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. ప్రధానంగా మన్ననూర్​ చెక్​ పోస్టుతోపాటు అమ్రాబాద్ మండల కేంద్రంలోనూ యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్డా వేస్తున్నారు. యురేనియం ముసుగులో నల్లమలను నాశనం చేయడం ద్వారా ప్రభుత్వమే తమకు మరణ శాసనం రాస్తోందంటూ, మూగ జీవాల ప్రాణాలను ఫణంగా పెట్టబోతోందంటూ విమర్శిస్తున్నారు. నల్లమలను ఏ విధంగా కాపాడుకోవాలో తమకు తెలుసని, ఊరికే చేతులు కట్టుకొని ఉండబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. యురేనియం మైనింగ్ వల్ల అడవి చుట్టూ ఉన్న కృష్ణానది కలుషితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి సినీ నటులు కూడా మద్దతు ఇస్తుండటం గమనార్హం.

నల్లమల ఉద్యమంపై స్పందించిన కేటీఆర్

 అన్ని వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతుండడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎట్టకేలకు స్పందించారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల వ్యవహారంలో అందరి ఆవేదనను తాను చూస్తున్నానని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి వ్యక్తిగతంగా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు కేటీఆర్.

సేవ్ నల్లమల : సమంతా మద్దతు 

ఇప్పటికే పెరుగుతున్న కాలుష్యం..ప్రకృతి వైపరీత్యాలు..ముంచెత్తుతున్న వరదలు..గుక్కెడు తాగునీటికి  కూడా మైళ్లకొద్దీ వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందనీ నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరిపితే ఈ ప్రమాదం మరింతగా పెరుగుతుందని టాలీవుడ్ గళమెత్తింది. పర్యవారణం విధ్వంసం అవడమే కాకుండా ప్రజారోగ్యం తీవ్ర ప్రభావానికి లోనవుతుందని మేధావులు, సామాన్యప్రజలు సైతం తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. 

సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు నినదిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లోని ప్రముఖులు ట్విట్టర్ లో తమ మద్దతు తెలిపారు. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ సమంతా కూడా తన మద్దతును ట్విట్టర్ ద్వారా తెలిపారు. సహజంగానే ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికురాలు అయిన  స‌మంత‌.. యురేనియం త‌వ్వ‌కాల నుండి న‌ల్ల‌మ‌ల అడ‌విని కాపాడండి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కోరింది. నల్లమల ఫారెస్ట్ లో యురేనియం త‌వ్వకాల‌కి వ్య‌తిరేకంగా వేసిన పిటీష‌న్‌లో తాను కూడా సంత‌కం చేశాననీ..మ‌రి మీరూ..అంటూ నెటిజన్స్‌ని ప్ర‌శ్నించింది.

ఇప్ప‌టికే డైరెక్టర్ శేఖర్ కమ్ముల , ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, విజయ్ దేవరకొండ, సాయి ధ‌ర‌మ్ తేజ్, అన‌సూయ వంటి సిని సెల‌బ్రిటీలు నల్లమల అడవులను కాపాడుకోవాల్సి అవసరం ప్రతీ ఒక్కరిపైనా ఉందనీ..పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. గోరేటి వెంకన్న, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరాం, చంద్ర సిద్ధార్థ, ఆర్పీ పట్నాయక్, గాయత్రీ గుప్తా, ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాలా వంటి పలువురు మద్ధతునిచ్చారు. గిరిజనులు, ఆదివాసీలు, చెంచులు వంటి పలు అటవీ జాతులకు సంబంధించిన వారు అటవులనే నమ్ముకుని జీవిస్తుంటారనీ..ఇప్పటికే అంతరించిపోతున్నాయనీ వాపోతున్న పెద్ద పులల ఆవాసాలైన నల్లమలో తవ్వకాలో మరింత ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. 

యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా change.org వెబ్ సైట్ లో ‘సేవ్ నల్లమల-స్టాప్ యురేనియం మైనింగ్’ పేరుతో పిటిషన్ పై సంతకాలు సేకరిస్తున్నారు.

Add new comment

10 + 2 =