హిమానీ నదం(Glacier)

ఉత్తరాఖండ్‌లో సంభవించిన జల ప్రళయం అందర్నీ విషాదంలో పడేసింది. హిమాలయాల్లోని హిమానీ నదం(Glacier) నుంచి మంచు ముక్కలుగా మారడంతో చమోలి జిల్లాలో ధౌలిగంగ నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది.  వరద ప్రవాహం    ధాటికి రైనీ తపోవన్ దగ్గరున్న రుషిగంగ డ్యామ్ తెగిపోవడం, అక్కడ ఉన్న  పవర్ ప్రాజెక్ట్ డ్యామ్ కొట్టుకుపోవడంతో భారీగా వరద పోటెత్తి  రైనీ గ్రామం దాదాపు జలసమాధి అయింది. నది తీరంలో ఇళ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 170 మంది సిబ్బంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

పర్యావరణ విధ్వంసం:

ఉత్తరాఖండ్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టులు ఎక్కువ. జల విద్యుదుత్పత్తికి గల అవకాశాల్ని సద్వినియోగం చేసుకొనే క్రమంలో పర్యావరణ విధ్వంసం బాగా జరిగింది.  ఒక్క అలక్‌నందపైనే 60 వరకూ జల విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మించారు. అంటే పర్యావరణం ఎంతగా ధ్వంసమైదో అర్థం చేసుకోవచ్చు.

ఉత్తరాఖండ్‌లో నదీలోయ లో  జీవావరణ వ్యవస్థ ధ్వంసమైపోనుందని కాగ్‌ పదేళ్లక్రితమే హెచ్చరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నతాధికార కమిటీ కూడా సముద్ర మట్టానికి రెండు వేల మీటర్ల ఎత్తున జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది . అలాంటి 23 ప్రాజెక్టుల్ని రద్దు చెయ్యాలని కూడా సిఫార్సు చేసింది. అయినా ఉత్తరాంఖండ్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. సొరంగాల కోసం కొండల్ని తొలిచి, విచ్చలవిడిగా వృక్షాలను నరికి, నదీప్రవాహాల్ని దారి మళ్ళించిన కారణంగానే ఇప్పుడీ ప్రకృతి  ప్రకోపం అన్నది నిపుణులు చెబుతున్న మాట.

ఉష్ణోగ్రత పెరుగుదల(Global warming):

భూమిపై వేడి పెరుగుతూ ఉంటే ఇలాంటి దుర్ఘటనలు మరిన్ని జరుగుతాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో గ్లేసియర్లు(Glacier) కరుగుతున్నాయి. హిమానీనదం (Glacier) అంటే గడ్డకట్టి ఉన్న నది అని అర్థం.  దీంతో గ్లేసియర్ సరస్సులు ప్రమాదకరంగా విస్తరిస్తున్నాయి. మామూలు నదుల్లో వరద  ఉద్ధృతి కంటే ఇలాంటి  హిమానీనదం ముక్కలుగా మారడంతో  సంభవించే  ఉద్ధృతి చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటి హిమానీనదాల్లో రెండు  రకాలుంటాయి. ఒకటి ఆల్పైన్ గ్లేసియర్స్. అంటే ఇవి లోయల్లోని లేదా పర్వతాల గ్లేసియర్లు. మరొకటి  సాధారణ ఐస్ గ్లేసియర్లు. ఇవి నదులు గడ్డకట్టినప్పుడు ఏర్పడే గ్లేసియర్లు. ఉత్తరాఖండ్ ఘటనలో విరిగిపడిన గ్లేసియర్ పర్వత గ్లేసియర్.

Add new comment

3 + 9 =