వెదర్ వార్నింగ్ - ముంబైలో మళ్లీ కుండపోత వానలులు | Climate change |

వెదర్ వార్నింగ్

గత కొన్ని రోజులుగా ప్రకృతి లో మార్పులను చూసినట్లయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి . ఒక నెల ముందు నీటికోసం చెన్నైవాసులు ఎన్ని కష్టాలు పడ్డారో చూసాము .  మనం మేలుకొనవలసిన అవసరం ఎంతో వుంది .పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనపై వుంది .నీటిని ,చెట్లను మనం కాపాడుకోవాలి .

భారీ వర్షం మళ్లీ ముంబైని ముంచెత్తింది.

ఆ మధ్య వర్షాలు తగ్గినట్లు కనిపించినా... మళ్లీ కుండ పోత వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువయ్యాయి. వరద నీటితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  23వ తేదీ మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ముంబై నగరమంతా నీటితో నిండిపోయింది. నగరవాసులు నడిసముద్రంలో ఉన్నట్లు ఫీలయ్యారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంబైలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై, రాయగడ్, రత్నగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో పాదాచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎక్కడ మ్యాన్‌హోల్‌లు నోళ్లు తెరుచుకుని ఉన్నాయో అనే భయం వారిలో నెలకొంది. రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో ఆఫీసులకు ఇతర పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

సియాన్ రైల్వే స్టేషన్‌లో అయితే వర్షపు నీరు రైల్వే ట్రాక్ పై నిలిచిపోయింది. వర్షం భారీగా కురుస్తున్నా.. లోకల్‌ రైళ్లు యథావిథిగానే తిరుగుతున్నాయని, కుర్లా-సోయిన్‌ స్టేషన్ల మధ్య 15-20 నిమిషాలు ఆలస్యంగా రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.

ఇక భారీ వర్షాలకు రహదారి కనిపించకపోవడంతో మూడు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రాత్రి 2.30 గంటల నుంచి తెల్లవారుజామున 5.30 గంటల వరకు ఏకంగా 51 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఒక రోజు ముంబైలో కురిసే సాధారణ వర్షపాతం కంటే ఇది ఐదు రెట్లు ఎక్కువ. 

మరో కొద్దిరోజులు ఇదే పరిస్థితి
ముంబైకి సమీపంలో తుపాను  ఏర్పాటు అవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గత రెండు రోజులుగా ముంబైలు వర్షాలు కురవలేదు. దీంతో కాస్త ఊపిరి తీసుకున్న నగర వాసులు.. బుధవారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు ఉలిక్కి పడ్డారు. ఈ నెల ప్రారంభంలో ముంబైలో కురిసిన భారీ వర్షాలకు మలాడ్‌లో ఓ గోడ కూలి 30 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

ఉత్తరాది రాష్ట్రాలను కూడా  భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బీహార్, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో.. నదులు ఉప్పొంగాయి. వర్షాల ధాటికి పలుచోట్ల కొండచరియలు విరిగిపడతున్నాయి. వరదల కారణంగా అసోం, బీహార్‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా.. 174 మంది వరకూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలు దాదాపు కోటీ పది లక్షల మందిపై ప్రభావం చూపాయి.

అటు బీహార్‌లోనూ గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా.. కురుస్తున్న వర్షాలకు సుమారు 106 మంది చినిపోయినట్లు తెలుస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 50.5 లక్షల మందిని సహాయ పునరావాస శిబిరాలకు తరలించారు.

 

 

Add new comment

13 + 1 =