విస్తారంగా వానలు .. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి |climate change

 రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా పడుతున్నాయి . దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. భాగ్యనగరంలో ముసురేసింది. దీంతో రహదారులన్నీ నీటితో జలమయమయ్యాయి. మరోవైపు ఎడతెరపి లేని వర్షాలతో చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తోన్నాయి. పర్యాటక క్షేత్రాలు కుంటాల, భోగత జలపాతాల వద్దకు పర్యాటకుల తాకిడి మరింత ఎక్కువైంది. వర్షం పడుతుండగా జలపాతాల అందాలు చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. రుతుపవనాలు చురుగ్గా కదలడంతో మరో మూడురోజులు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసినట్టు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మహబూబ్ నగర్, నారాయణపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో చిరుజల్లులు కురిసాయి. గురువారం కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలో 9.1 సెంటిమీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆలస్యమైనా వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు పొలం పనుల్లో తలమునకలయ్యారు.
గురువారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోండగంతో భారీగా వరదనీరు చేరింది. చుట్టుపక్కల ఉన్న పొలాలకు కూడా వరదనీరు చేరింది. అటవీప్రాంతాల్లో వర్షం కురవడంతో ఆ వరదనీరు జంపన్న వాగులోకి క్రమంగా చేరుతుంది. నీటిని కిందకి వదిలేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
భాగ్యనగరం ముసురేసింది. నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఉదయం నుంచి కూడా వాన పడటంతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. తేలికపాటి వర్షాలకు నదులను తలపించే హైదరాబాద్ రోడ్లు ఎప్పటిలాగే నరకానికి నకళ్లుగా మారాయి. గుంతల్లోకి నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి
 

 

Add new comment

1 + 7 =