మొన్నటిదాకా కరవు ఇప్పుడు ముంచేస్తోన్న వరదలు దేనికి సంకేతం ??

మొన్నటి దాకా కరవుతో అల్లాడిన పలు రాష్ట్రాలు.. తాజాగా వరద పోటుకు గురయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల చాల చోట్ల   ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అంచనాలకు మించిన వర్షపాతం నమోదవుతోంది. వర్షాలు కసి తీరా, కరవు తీరా కురుస్తున్నాయి . అతి సాధారణ వర్షపాతం నమోదయ్యే రాష్ట్రాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు పడటం మంచిదే గానీ ఉన్నట్టుండి ఇలా ముంచెత్తడం అనేది నిపుణులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఆందోళనకు దారి తీస్తోంది. దీనికి ప్రధాన కారణం " వాతావరణ మార్పు".

వాతావరణ మార్పులపై అంతర్జాతీయ ప్యానెల్ (ఇంటర్నేషనల్ ప్యానెల్ ఫర్ క్లైమెట్ ఛేంజ్-ఐపీసీసీ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఇదే ప్రమాదాన్ని శంకిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరగడానికి గల కారణాలపై అధ్యయనం చేయడానికిక ఏర్పాటైంది ఈ అంతర్జాతీయ ప్యానెల్. జెనీవాలో ఈ నివేదికను  ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం వల్ల వాాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని, సమతౌల్యం దెబ్బతినడం వల్ల అటు ఎండ కాచినా, ఇటు వానలు కురిసినా..అంచనాలకు మించి నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఐపీసీసీ తాజా నివేదికలో స్పష్టం చేశారు.  తమ తమ దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 118 దేశాల్లో ఈ ప్యానెల్ అధ్యయనం చేసింది.
భూ వినియోగం మితి మీరి పెరగడం వల్లే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఈ ప్యానెల్ తన నివేదికలో స్పష్టం చేసింది. అభివృద్ధి, నగరీకరణ పేరుతో అడవులను ఇష్టానుసారంగా నరికి వేయడం వల్ల వాతావరణంలో సమతౌల్యం దెబ్బతింటోంది. నివాసాల కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం అటవీ భూమిని సైతం వినియోగంలోకి తీసుకుని వస్తున్నారు. నివాసయోగ్యంగా మార్చుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉందని ఈ నివేదికలో స్పష్టం చేశారు.  భూములను నివాస యోగ్యంగా మార్చడం వల్ల పంట ఉత్పత్తి తగ్గుతోందని, ఫలితంగా- జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు సమీప భవిష్యత్తులో ఉండకపోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
ప్రస్తుతం భూగోళం మీద 75 శాతం స్థలంలో జనం నివసిస్తున్నారు. ఫ్యాక్టరీల నిర్మాణం, ఆకాశ హర్మ్యాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం భూమిని వినియోగిస్తున్నారు. పచ్చదనం పెరగాల్సిన ప్రాంతాలన్నీ కాంక్రీటుమయం అవుతున్నాయి. ఫలితంగా వాాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనదేశంలో పంట విస్తీర్ణం అత్యధికంగా ఉన్న రాష్ట్రం పంజాబ్. పంజాబ్ లో పండించే బియ్యం మొత్తం దేశం మొత్తానికీ సరఫరా అవుతోన్న విషయం తెలిసిందే. రైస్ బౌల్ ఆఫ్ ద ఇండియాగా ఆ రాష్ట్రానికి పేరుంది. అలాంటి చోట కూడా పంట విస్తీర్ణం తగ్గుతోంది. ఇదే పరిస్థితి దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోందని వెల్లడించారు.
 
 ఓ వైపు కరవు, ఇంకో వైపు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేది రైతాంగమే. అభివృద్ధి, నగరీకరణ పేరుతో చేపడుతున్న కట్టడాల నిర్మాణాల దుష్ప్రభావానికి గురవుతున్నది మొట్టమొదటి బాధితుడు రైతే కావడం బాధాకరమని నివేదికలో స్పష్టంచేశారు. భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అంచనా వేశారు. దీన్ని నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అత్యంత ప్రమాదకరంగా పెరుగుతోన్న నగరీకరణను గానీ, అనవసర భూ వినియోగాన్ని గానీ అడ్డుకోకపోతే.. సమీప భవిష్యత్తులో సంభవించే భయానక పరిస్థితులకు కారణమౌతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

 

 

 
 

 

Add new comment

1 + 8 =