మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం -గ్రేటా తన్‌బర్గ్

ప్రపంచాన్ని షేక్ చేస్తోన్న పర్యావరణ ఉద్యమం.. బాలికతో మొదలై!

 

ఓ స్కూల్ విద్యార్థి ఆలోచన ప్రపంచాన్ని కదిలించింది. 157 దేశాల్లో పర్యావరణ ఉద్యమాన్ని తీసుకొచ్చింది. మన దేశంలోనూ 27 నగరాల్లో ఉద్యమం మొదలయ్యింది. మన భాగ్యనగరంలోనూ భారీ ప్రదర్శన.మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఇదే నినాదంతో పర్యావరణ ఉద్యమం మొదలయ్యింది. 150 దేశాల్లో, 1700చోట్ల ప్రజలంతా చేయి, చేయి కలిపారు. ఉద్యోగాలు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లకుండా ఓ గొప్ప కార్యక్రమం కోసం ఏకమయ్యారు. భారత్‌లో ముంబై నుంచి పుణె, రాజధాని ఢిల్లీ.. ఇలా 27 నగరాల్లో ఈ గ్లోబల్ క్లైమేట్ స్ట్రైక్ జరుగుతోంది. ఈ నెల 20 నుంచి 28 వరకు వరుసగా ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు.

స్విట్జర్లాండ్‌కు చెందిన గ్రేటా తన్‌బర్గ్ అనే స్కూల్ విద్యార్థిని ఈ గ్లోబల్ క్లైమేట్ స్ట్రైక్‌కు శ్రీకారం చుట్టింది. తానే పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణిగా మారింది.. ప్రపంచ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. వాతావరణ మార్పులతో పర్యావరణానికి ఎదురయ్యే ఇబ్బందులపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. దేశాధినేతలు, ప్రజా ప్రతినిధులు పర్యావరణ సంక్షోభంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ప్రజా ప్రతినిధి శిలాజ ఇందనాల వాడకాన్ని తగ్గించి.. ప్రతి ఒక్కరికి వాతావరణపరంగా న్యాయం చేయాలంటోంది గ్రేటా. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, ఆఫీసులు, స్కూళ్లు, యూనివర్శిటీల నుంచి బయటకు రావాలని.. అలాగే దేశాధి నేతలు వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలంటోంది. అంతేకాదు ఆమె తన డిమాండ్ కోసం స్కూల్ కూడా మానేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తోంది.. ఆమెను ఆదర్శంగా తీసుకొని మరికొందరు కూడా రోడ్లపైకి వచ్చారు. అలా ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఊపందుకుంటోంది. ఈ గ్లోబల్ క్లైమేట్ స్ట్రైక్ కార్యక్రమంతో ఈ ఖగోళాన్ని కాపాడలేము.. ప్రజా ప్రతినిధులు తీసుకునే నిర్ణయాలు, ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుంది. ఈ నెల 23న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు, దేశాధినేతలు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్‌లోనే క్లైమట్ స్ట్రైక్ ఉద్దేశాలు, పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసేలా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ ఉద్యమం. మన జీవన మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చేతులు కలపాలి.
ఇటు హైదరాబాద్‌లోనూ ఈ గ్లోబల్ క్లైమేట్ స్ట్రైక్‌ను నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం భాగ్యనగరవాసులు నెక్లైస్ రోడ్డులో భారీ ప్రదర్శన నిర్వహించారు. దాదాపు రెండుగంటల పాటూ పర్యావరణాన్ని కాపాడాలంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. ఈ నెల 28 వరకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాయి.

Source :samayam

Add new comment

4 + 2 =