ధరిత్రి దినోత్సవం | ఏప్రిల్ 22

ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వార్షిక కార్యక్రమం. 1970 లో మొదటి ధరిత్రి దినోత్సవం జరుపుకున్నాం. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్యోద్దేశం.

భూమిని కాపాడుకోవాలి :
విశ్వంలో మ‌న‌కు తెలిసిన అన్ని గ్ర‌హాల్లోకీ ఒక్క భూగ్ర‌హం మాత్ర‌మే ఎంతో అందంగా, ఆహ్లాదంగా దేవుడు సృష్టించాడు.  ప‌చ్చ‌ని వృక్షాలు‌, కొండ కోన‌లు, నీరు వంటి ప్ర‌కృతి సంప‌దంతా క‌లిసి ఇక్క‌డ మ‌నుషుల‌తో పాటు ఇత‌ర జీవ‌రాశులు బ‌త‌క‌డానికి స‌హ‌క‌రిస్తున్నాయి.

ప్రస్తుత రోజులలో తాగే నీరు.. పీల్చే గాలి.. నివసించే నేల... ఇలా అన్ని  కాలుష్యంలో చిక్కుకున్నాయి.పెరిగిపోతున్న భూతాపం, వాతావరణ కాలుష్యంతో అల్లాడుతున్న భూమాతను మనం కాపాడుకోవాలి. ఉపరితలంపై ఉన్న వనరులే కాదు, భూగర్భ జలాలు, ఖనిజ వనరులను పలు దేశాలు విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల భూతాపం పెరిగి రాబోయే కొన్ని దశాబ్దాలలో ముడిచమురు నిల్వలు అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  పరిశ్రమలు, వాహనాలు తదితరాల నుంచి వెలువడుతోన్న క్లోరోఫోరో కార్బన్‌లు భూగ్రహాన్ని మరింత వేడెక్కిస్తూ పలు కాలుష్యాలకు కారణమవుతున్నాయి.

మనుషులు సృష్టించుకున్న వివిధ  రకాల యంత్రాలు, వాహనాల నుంచి వెలువడే కలుషిత వాయువులు మనుషులనే ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి. మానవుల స్వార్ధం ఫలితంగా ఇప్పుడు భూగోళం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.
మనం పుట్టిన ఊరు, పట్టణం ఏదైనా మనం నివసిస్తున్న ప్రాంతాన్ని కాలుష్య రహితంగా పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు మనమందరం  కృషి చేయాలి. రాబోయే తరాలకు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రపంచ ధరిత్రీ దినోత్సవం (World Earth Day) ముఖ్య ఉద్దేశ్యం.

Add new comment

13 + 4 =