చత్తీస్‌గఢ్‌ను ఆనుకుని అల్పపీడనం.. బంగాళాఖాతంలో ఆగస్టు 4న మరొక అల్పపీడనం

Godavari at NasikGodavari at Nasik

ఎగువ రాష్ట్రాల్లో వరదలు పోటెత్తుండటంతో పరవళ్లు తొక్కుతూ తెలుగు రాష్ట్రాలవైపు ఉరకలేస్తున్న గోదావరి . నది జన్మస్థలమైన మహారాష్ట్రాలోని నాసిక్ వద్ద మరింత ఉగ్రరూపం.

గడచిన మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఏపీ, తెలంగాణకు జీవధారమైన కృష్ణ, గోదావరి నదుల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఉత్తర ఒడిశా మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఛత్తీస్‌గఢ్‌‌ను ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్‌ మీదుగా ఉందని అధికారులు తెలిపారు. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో ఇది కలిసిపోయిందని వివరించారు. మరోవైపు రాజస్థాన్‌ నుంచి ఒడిశా వరకూ ఉన్న ద్రోణి ఈ ఉపరితల ఆవర్తనంతో కలిసి కొనసాగుతున్నట్టు తెలియజేశారు. 

కాగా, ఆగస్టు 4న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 3 వరకు కోస్తా, యానాం ప్రాంతాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకట్రెండుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆగస్టు 5 నుంచి 8 వరకు ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. కొందమమాల్, బౌద్ ప్రాంతాల్లో 7 నుంచి 10 సెం.మీ. వర్షపాతం నమోదవుతుందని, మయూర్‌భంజ్, కెంఝార్, ఢెంకనాల్, బాలాసోర్, పూరి, జగత్సింగ్‌పూర్ సహా పలు జిల్లాలో ఆగస్టు 8న ఐదు నుంచి ఏడు సెం.మీ. వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. 

కాగా, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నాసిక్‌లో గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిని మించి గోదావరి ప్రవహిస్తోంది. నది ఉద్ధృతితో పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నది ఒడ్డు ఉన్న ఆలయాలన్నీ ముంపులో చిక్కుకున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముంపు పొంచి ఉన్న మరిన్ని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

అలాగే, గోదావరి ఉపనది శబరి పోటెత్తడంతో మంగళవారం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదారమ్మ ఉరకలు వేసింది. మరో ఉపనది ఇంద్రావతి నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో బుధవారం మరింత ఉప్పొంగింది. పోలవరం వద్ద మంగళవారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 20.70 మీటర్లకు చేరింది. సుమారు 5.28 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఎగువ కాఫర్‌డ్యామ్‌ వద్ద 24.50 మీటర్లకు వరద పెరిగింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ నుంచి మంగళవారం రాత్రి 4.34 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆ సమయంలో బ్యారేజీ వద్ద 8.9 అడుగుల నీటిమట్టం ఉంది

Add new comment

3 + 14 =