ఏపీ వైపు దూసుకొస్తున్న అసని

ఏపీకి అసని తుఫాన్ ముప్పు ఉందంటోంది విపత్తుల నిర్వహణశాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను 'అసని' గంటకు 25 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతోందంటున్నారు.

ఈరోజు ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అనంతరం దిశమార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ ఒడిశా వైపు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.  'అసని'  క్రమంగా బలహీనపడే అవకాశం ఉందంటున్నారు. దీని  ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి  ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు.. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో గాలులు వీస్తాయంటున్నారు.

గడిచిన 6 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం కాకినాడకు 330 కి.మీ., విశాఖపట్నంకు 350 కి.మీ., గోపాలపూర్ కు 510 కి.మీ., పూరీకు 590 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.

మంగళవారం రాత్రికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చి అనంతరం దిశమార్చుకుని ఉత్తరాంధ్ర ఒడిశా తీరాలకు దూరంగా ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతం వైపు వెళ్ళే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.వచ్చే 12గంటల్లో తీవ్రతుపాను క్రమంగా బలహీన పడి తుపానుగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో గాలివానలు కురుస్తున్నాయి. ఈదురు గాలులకు చెట్లు నేలకొరుగుతున్నాయి.శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, సరుబుజ్జిలి, పొందూరు, బూర్జ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను కారణంగా ముందు జాగ్రత్త చర్యగా విశాఖ నుంచి నడుస్తున్న 23 ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేశారు.

Add new comment

14 + 1 =