Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
నియమాలు, ఆజ్ఞలు పాటించడం మాత్రమే క్రైస్తవత్వం కాదు: పోప్ ఫ్రాన్సిస్
నియమాలు, ఆజ్ఞలు పాటించడం మాత్రమే క్రైస్తవత్వం కాదు: పోప్ ఫ్రాన్సిస్
15 నవంబర్ 2020 న ఫ్రాన్సిస్ పోప్ గారు ప్రపంచ పేదల దినోత్సవాన్ని వాటికన్ లో దివ్యబలిపూజ అర్పించుట ద్వారా కొనియాడారు.
ఈ దివ్యపూజాబలికి హాజరు కావడానికి 100 మందికి మాత్రమే అనుమతి లభించింది. వారిలో వాలంటీర్లు, స్వచ్చంద సేవ సంస్థల ప్రతినిధులు మరియు స్వచ్చంద సంస్థల ద్వారా సహాయాన్ని పొందుతున్న వారు ఉన్నారు.
దివ్యబలిపూజలోని తన సందేశంలో యజమాని, సేవకుల ఉపమానమును గూర్చి పోప్ గారు గుర్తుచేసుకున్నారు. దూరదేశాలకు వెళుతున్న యజమాని తన సేవకులకు తన ధనాన్ని అప్పగించిన విధానము, వారు తమ యజమాని ఇచ్చిన ధనాన్ని ఏ విధంగా ఉపయోగించారు అనే విషయాలను ధ్యానించారు. ఉపమానంలోని విధంగా దేవుడు మనందరికీ కొంత ధనాన్ని అప్పగిస్తున్నారని అన్నారు.
మన జీవితాలలో తరచూ మనకు ఏమి తక్కువైనవో అవి మాత్రమే కనిపిస్తాయి. దీని వల్లనే మనం ఎప్పుడూ 'నాకే కనుక ఈ ఉద్యోగం ఉంటే', 'నాకే అటువంటి ఇల్లు ఉంటే', 'నాకే కనుక డబ్బు విజయం ఉంటే', 'నాకే కనుక ఈ కష్టం లేకుంటే' ఇటువంటి మాటలు అంటుంటాం. 'నాకే కనుక' అనే మాట మన చుట్టూ ఉన్న మంచిని చుడనివ్వకుండా చేస్తుంది. మనలో ఉన్న ప్రతిభను మనం గుర్తించకుండా చేస్తుంది అని పోప్ గారు ప్రభోదించారు.
మంచి దాసులు తెలివిగా వారి వద్ద ఉన్న ధనాన్ని ఉపయోగించి మరింత ధనాన్ని సంపాదించారు. వీరు ఉన్న ధనాన్ని పోగొట్టుకుంటామేమో అని భయపడకుండా వారి వద్ద ఉన్న ప్రతిభతో ధనాన్ని అధికం చేసారు. అదే విధంగా క్రైస్తవులు కూడా భయాలను విడచి వారి వద్ద ఉన్న ప్రతిభను దేవుని మహిమార్ధం ఉపయోగించాలని పోప్ గారు కోరారు.
క్రైస్తవులు వట్టిగా నియమాలను, ఆజ్ఞలను పాటిస్తూ జీవించడం చూస్తుంటే ఎంతో బాధాకరంగా ఉందని, జీవితంలో ధైర్యం మరియు సృజనాత్మకత లేకుండా బ్రతకడం మృత్యువుతో సమానమని పోప్ గారు అభిప్రాయపడ్డారు.
చెడుకు దూరంగా ఉండడమేకాదు, మంచి చెయ్యడానికి కూడా ముందుకు రావాలని, ఇతరుల అవసరటాలను గూర్చి పట్టించుకోకుండా తమ స్వంత అవసరాలను గూర్చి మాత్రమే ఆలోచించే వారు జీవించి కూడా వ్యర్ధమే అని పోప్ గారు అన్నారు.
ఆగమన కాలం సమీపిస్తున్నది. క్రీస్తు జయంతికి మనం ఏమి కొనుక్కోవాలని, మనకు ఏమి బహుమతులు లభిస్తాయని ఆలోచిస్తాం. ఈ సారి ఇతరులకు నేను ఏమి ఇవ్వగలను అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం అని పోప్ గారు పిలుపునిచ్చారు.
సామాజిక దూరాన్ని పాటిస్తూ జరిగిన ఈ పూజా బాలిలో క్రితం సంవత్సరాలలో లాగా ఊరేగింపులు గాని, సామూహిక భోజన కార్యక్రమాలు కానీ జరగలేదు. వచ్చిన ప్రతిఒక్కరికి పోప్ గారు ఆహార పదార్ధాలు ఉన్న ఒక ప్యాకెట్ ను ఇచ్చారు.
Add new comment