Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
ఆధునిక సాంకేతిక పరికరాలకు బానిసలు కాకండి: ఫ్రాన్సిస్ పాపు గారు
ఆధునిక సాంకేతిక పరికరాలకు బానిసలు కాకండి: ఫ్రాన్సిస్ పాపు గారు
రాబోవు మ్రానికొమ్మల ఆదివారం నాడు ప్రపంచంలోని ప్రతి మేత్రాసనం ప్రపంచ యువతా దినోత్సవాన్ని కొనియాడబోతూఉంది. ఈ సంవత్సరపు నినాదం "ఓ యువకుడా! పైకి లెగువుమని నీతో చెప్పుచున్నాను". రెండవ జాన్ పాల్ పాపు గారు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఏప్రిల్ 5 , 2020 న 35 వసంతాలు నిండనున్నవి.
ఈ సందర్భముగా ఫ్రాన్సిస్ పాపు గారు యువకులందరికి ఒక లేఖను ప్రచురించారు. యువకులందరు కరుణ కలిగి ఉండాలని ఆయన ప్రోత్సహించారు. బాధలలో కన్నీరు కార్చు వారితో కన్నీరు కార్చుట నేర్చుకుంటే నిజమైన సంతోషాన్ని కనుగొనగలమని ఆయన అన్నారు.
"నేను నాకు కావలిసినవి దొరకక వాటికోసం బాధ పడుతున్నానా? లేక బాధలలో ఉన్న వారిని చూసి, ఆకలిదప్పులతో, అనాధలుగా, నిర్భాగ్యులుగా ఉన్నవారి బాధలను చూసి బాధ పడగలుగుతున్నానా?" అని మనలో ప్రతి ఒక్కరు తమను తాము ప్రశ్నించుకోవాలి అని పాపుగారు ప్రబోధించారు.
బాధలు అనుభవిస్తున్న, హింసకు గురైన, అవకాశాలు కరువైన తమ సహోదరుల బాధలను తమ సొంత బాధలుగా చూడాలని ఆయన యువకులను అభ్యర్ధించారు.
అదేవిధంగా యువత నేటి సాంకేతిక పరికరాలైనటువంటి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లకు అలవాటుపడి ఎవరి లోకంలో వారు ఒంటరిగా జీవిస్తున్నారు అటువంటి అవాస్తవిక పరికరాలను వదిలి వాస్తవిక జీవితంలోకి రావడానికి ప్రయత్నించాలని, ఆధునిక సాంకేతిక పరికరాలను సరైన విధంగా, తగిన మోతాదులో వినియోగించాలని అంతేకాని వాటినే సర్వస్వం అనే అపోహలో జీవించకూడదని ఆయన హితవు పలికారు.
ప్రియమైన యువకులారా, మనం నిర్వీర్యంగా, బద్ధకంగా, సౌకర్యంగా జీవించటానికి పుట్టలేదు, మన జీవితానికి ఒక గుర్తింపు ఉండేలా జీవించాలి. ఎటువంటి గుర్తింపు లేకుండా జీవితాన్ని చాలించడం ఎంత బాధాకరం. అని ఆయన యువకులను ప్రశ్నించారు.
జీవితంలో అపజయాలను ఒక క్రొత్త ప్రారంభానికి తొలి అడుగులుగా మలుచుకోవాలని, ఒక క్రొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని, గొప్ప కార్యాలు చెయ్యడానికి ఉత్సుకత కలిగి ఉండాలని ఆయన యువకులకు ఆహ్వానం పలికారు.
Add new comment