అంతర్జాలంలో విద్య పిల్లలకు వరమా, శాపమా?

Online Studies అంతర్జాలంలో విద్య

అంతర్జాలంలో విద్య పిల్లలకు వరమా, శాపమా? 

 

ప్రపంచమంతా వ్యాపించిన కరోనా మహమ్మారి వల్ల ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో ముఖ్యమైనది మరియు భారత దేశంలో గుర్తించదగ్గ మార్పు విద్య వ్యవస్థ లో చోటు చేసుకుంది. ఇంటి వద్దనే ఉండి, అంతర్జాలంలో తరగతులకు హాజరు కావడం ఇప్పుడు అన్ని విద్యాలయాలు పాటిస్తున్న పద్దతి. ఈ పద్దతి ద్వారా ఇంట్లోనే ఉండి, సామాజిక దూరాన్ని పాటిస్తూ తరగతులకు హాజరు కావచ్చు. విద్యావ్యవస్థలో పెను మార్పులు వస్తున్నాయి. ఈ నూతన పద్ధతులకు అలవాటు చేసుకోవడానికి  విద్య సంస్థల, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కృషి చేస్తున్నారు. ముఖాముఖీ తరగతి గదులలో పాఠాలను బోధించే మన సనాతన పద్దతులను వీడి ఇప్పటి కొత్త పద్దతులను అలవర్చుకోవడం కొంచం కష్టమైన విషయమే కానీ తాజా అధ్యయనాల ప్రకారం 90 శాతం అధ్యాపకులు అంతర్జాలం ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. 

ఈ విద్యా ప్రక్రియను గూర్చి సర్వత్రా అనేక వాదనలు వినిపిస్తున్నాయి కళాశాలలు ఎప్పుడు మొదలుతాయో స్పష్టమైన సమాచారం లేకున్నా, ప్రస్తుతానికి మాత్రం అంతర్జాలం లోనే విద్యా బోధన సాగవలసిన పరిస్థితి నెలకొని ఉంది. 

లాభాలు 

ఈ నూతన విద్యా విధానం వల్ల విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అనేక లాభాలు ఉన్నాయి. అధ్యాపకులు ఒకే సమయంలో అనేక వందల మంది విద్యార్థులకు ఎటువంటి కష్టం లేకుండా పాఠం చెప్పే అవకాశం ఉంది. అధ్యాపకులు ఈ పద్దతి ద్వారా అనేక సృజనాత్మక పద్ధతులు ఉపయోగించి పాఠాలు చెప్పవచ్చు. పాఠశాలా గదిలో సాధ్యం కాని కొన్ని పద్ధతులు ఇటువంటి విధానం ద్వారా సాధ్యపడతాయి. విద్యార్థులు తమ ఇళ్లలోనే ఉంది తరగతులకు హాజరు కావచ్చు. అధ్యాపకులు వాడుతున్న సృజనాత్మక విధానాల వల్ల విద్యార్థులు పాఠ్యఅంశాలను సులువుగా అర్ధం చేసుకోవచ్చు. అదేసమయంలో పిల్లల తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు ఏమి నేర్చుకుంటున్నారో ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించింది.

నష్టాలు 

ఈ నూతన విధానం వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు క్రీడలు, లలిత కళలు వంటి వాటికి దూరంగా ఉండవలసి వస్తుంది. తోటి విద్యార్థులతో కలిసి తరగతి గదిలో కలిసి చదువుకోవడం, కలిసి ఆదుకోవడం వంటివి చెయ్యలేనందున, పిల్లలకు మానసిక ఉల్లాసం కరువడవచ్చు. అందరు విద్యార్థులకు తమ ఇళ్లలో అంతర్జాలం అందుబాటులో లేక పోవచ్చు. అధిక సమయం కంప్యూటర్ లేదా ఫోన్ చూడడం వల్ల పిల్లలకు కళ్ళ సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంది. సాంకేతిక వనరుల లోపం వల్ల కొన్ని పాఠశాలలు అధిక మొత్తంలో పాఠాలను అంతర్జాలం ద్వారా పంపడం, దాన్ని అంతా పిల్లలు డౌన్ లోడ్ చేసుకోవడం, పర్యవసానంగా విద్యా బోధ ఏకదిశాత్మకంగా మారింది. 

గుర్తించవలసిన అంశాలు 

ప్రస్తుత కరోనా విలయ తాండవ నేపథ్యంలో పాఠశాలలు మూసి ఉంచడం ఎంతో మంచి పరిణామం. అదే సమయంలో పిల్లలకు అంతర్జాలం ద్వారా పాఠాలను బోధించడం కూడా ఆహ్వానించదగ్గ మార్పు. కాని పిల్లలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఈ క్రొత్త రకం చదువుల వల్ల మాత్రమే సాధ్యపడడం కష్టతరమనే చెప్పాలి. పాఠాలు బోధించే విధానంలో ఎన్నో సృజనాత్మక మార్పులు వచ్చిన మాట నిజమే అయినప్పటికీ, పిల్లలు క్రీడలు, లలిత కళలు వంటి వాటిలో పాల్గొనే అవకాశం తగ్గుతుంది. కనుక పిల్లల సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే మన సనాతన పద్దతిలోనే  తరగతి గదులలో, సృజనాత్మక పద్దతులలో అనగా వీడియోల ద్వారా మరియు అనేక దృశ్య శ్రవణ పరికరాల ద్వారా పాఠాలను బోధించడం జరగాలి.

ఈ కరోనా తీవ్రత తగ్గిన అనంతరం పాఠశాలలు త్వరిత గతిన తెరుచుకొని విద్యార్థులకు జ్ఞాన నిలయాలుగా ఉంటాయని ఆశిద్దాం.

Add new comment

6 + 4 =